మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలనలో ఈగల్ వ్యవస్థ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.ఈగల్ వ్యవస్థను ప్రారంభించిన ఏడాదిన్నరలోనే జీరో గంజాయి రాష్ట్రంగా చేసాం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదాన్ని పాఠశాల స్థాయిలోకి తీసుకువెళ్తున్నామని, డ్రగ్స్ ప్రభావంతో నష్టపోయిన యువతను తిరిగి సాధారణ జీవితానికి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. గతంలో గంజాయికి బానిసైన యువతను చూసి తల్లిదండ్రులు బాధపడ్డారని అనిత అన్నారు.
డ్రగ్స్‌పై అవగాహన – పాఠశాల స్థాయిలోనే ప్రారంభం:
“డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు, కేసుల్లో ఇరుక్కుంటే వచ్చే నష్టాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. యువత భవిష్యత్తుపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు. డ్రగ్స్ దందా చేసిన వారిని కాపాడటం ఆయన తీరుగా మారింది” అని అనిత విమర్శించారు.
ఆమె మాట్లాడుతూ, “మాదకద్రవ్య కేసులో దొరికిన కొండారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడం వైకాపా దుస్థితిని చూపుతోంది. 2019–24 మధ్య దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని అప్పట్లో అనిపించేది” అని అన్నారు.
చంద్రబాబు నేతృత్వంలో డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబాటు :
“అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌దే. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు డ్రగ్స్, గంజాయిపై సమగ్రంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇందుకోసం ఆరుగురు మంత్రులతో ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు” అని వెల్లడించారు.
ఆమె మాట్లాడుతూ, “డ్రగ్స్ నిర్మూలనలో ఈగల్ వ్యవస్థ కేవలం నేర నియంత్రణకే కాదు, యువత భవిష్యత్తుకు మార్గదర్శకంగా కూడా నిలుస్తుంది” అని చెప్పారు.
