శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో 8 మంది ఇంజనీర్లు, కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి ఏడు రోజులు గడుస్తున్నా, వారిని బయటకు తీసుకురావడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్వో, నేవీ, ఆర్మీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, హైడ్రా సహా ప్రైవేట్ సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సొరంగంలో 200 అడుగుల మేర పేరుకుపోయిన బురదను, టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలు ఉపయోగిస్తున్నారు. సహాయక చర్యలు పూర్తవడానికి మరో రెండు రోజులు పట్టొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
టన్నెల్ ప్రమాదం కారణంగా అక్కడి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చాలామంది కార్మికులు సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, భవిష్యత్తులో టన్నెల్ పనులను కొనసాగించాలా లేదా అనే విషయంపై ఆలోచిస్తున్నామని కార్మికులు చెబుతున్నారు.
యూపీ, బీహార్, ఝార్ఖండ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇప్పటికే టన్నెల్ ప్రాంతాన్ని వీడిపోయారు. ప్రభుత్వం, అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నా, లోపల చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం ఎంతో కీలకంగా మారింది.