పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని, మానసిక స్థిరత్వం లేని వ్యక్తి అని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం అదియాలా జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్, తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మునీర్ పాలనలో అణచివేత గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఉందని ఇమ్రాన్ విమర్శించారు. అధికార దాహంతో కళ్లుమూసుకున్న మునీర్, దాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి హద్దులు దాటతారో ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని తెలిపారు.
మే 9 మురిడ్కే ఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. నిరాయుధ పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఏ నాగరిక సమాజంలోనూ ఊహించలేమని ఖాన్ పేర్కొన్నారు. మహిళలపై ఇంతటి దారుణం పాకిస్థాన్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు.
ALSO READ:అత్తకు తలకొరివి పెట్టిన ఆదర్శ కోడలు – హృదయాన్ని కదిలించిన సంఘటన
తన భార్య బుష్రా బీబీని ఏకాంత నిర్బంధంలో ఉంచి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. బానిసత్వంలో బతకడం కంటే మరణమే మేలని వ్యాఖ్యానించారు.
ఏ రాజకీయ నాయకుడి కుటుంబం కూడా ఇంతటి దౌర్జన్యాన్ని ఎదుర్కోలేదని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసీమ్ మునీర్, షెహబాజ్ షరీఫ్ లాంటి నాయకులతో సయోధ్యకు తాను సిద్ధం కాదని స్పష్టం చేశారు. తాను ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నా లొంగిపోనని, తలవంచనని ఆయన తేల్చి చెప్పారు.
