కర్ణాటకలో ఓ వ్యక్తి హత్య వెనుక దాగి ఉన్న ఇన్సూరెన్స్ మోసం బయటపడింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చంపి, ప్రమాదంలా చూపించి రూ.5 కోట్ల బీమా డబ్బులు కొల్లగొట్టాలని ముఠా పన్నిన కుట్ర చివరికి విఫలమైంది. అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ దారుణం బహిర్గతమై, పోలీసులు కేవలం 24 గంటల్లోనే నేరగాళ్లను అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే, హోస్పేటకు చెందిన గంగాధర్ (34) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన పేరు మీద రూ.5 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉండటాన్ని గమనించిన ముఠా పక్కాగా ప్లాన్ వేసింది. గంగాధర్‌ను చంపి, ఆయన మృతదేహాన్ని ప్రమాదంలా మలచాలని నిర్ణయించుకుంది. ప్లాన్ ప్రకారం గంగాధర్‌ను హతమార్చిన వారు, శివార్లలోని రోడ్డుపై ఆయన మృతదేహాన్ని స్కూటర్‌పై కూర్చోబెట్టి కారుతో ఢీకొట్టారు. దీంతో ఇది సాధారణ రోడ్డు ప్రమాదంలా కనిపించిందని భావించారు.
తరువాత ముఠాలోని ఒక మహిళ ముందుకు వచ్చి తానే గంగాధర్ భార్యనని చెబుతూ బీమా డబ్బులు పొందేందుకు ప్రయత్నించింది. అయితే అసలు భార్య శారదమ్మ ఎంట్రీ ఇవ్వడంతో అసలు నిజం బయటపడింది. పోలీసులు సమాచారం ఇచ్చిన వెంటనే ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని తన భర్త వాహనం నడపడం అసాధ్యమని తెలిపారు. ఎందుకంటే, గంగాధర్ పెరాలసిస్ కారణంగా ఎడమవైపు శరీరం పనిచేయడం మానేసింది. అలాంటి వ్యక్తి స్కూటర్ నడపడం అసాధ్యం కాబట్టి ఇది యాదృచ్ఛిక ప్రమాదం కాదని స్పష్టం చేశారు.
దాంతో అప్రమత్తమైన పోలీసులు కేసును లోతుగా విచారించి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పన్నిన ముఠా కుట్రను ఛేదించారు. కేవలం 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి, కుట్రను పూర్తిగా బయటపెట్టారు. ఈ ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది.