ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ: ట్రంప్ మధ్యప్రాచ్యంలో శాంతి శకం కోసం పిలుపు


మధ్యప్రాచ్యంలో సరికొత్త శాంతియుగానికి ఇది సరైన సమయం అని, దశాబ్దాల నాటి శత్రుత్వానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, గాజా భవిష్యత్తుపై ఈజిప్టులోని షర్మ్ అల్-షేక్లో సోమవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సదస్సులో ట్రంప్, “పాత తరం గొడవలను, ద్వేషాలను పక్కనపెట్టి ముందుకు సాగేందుకు మనకు ఒక సువర్ణావకాశం లభించింది. మన భవిష్యత్తును గత కాలపు యుద్ధాలు నిర్దేశించకూడదు” అని స్పష్టం చేశారు. గాజా భవిష్యత్తుకు సంబంధించిన కీలక పత్రంపై ట్రంప్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సంతకాలు చేశారు. సుమారు 36 దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈజిప్టు పర్యటనకు ముందుగా ట్రంప్ ఇజ్రాయెల్లోని పార్లమెంట్ (క్నెసెట్)లో ప్రసంగించారు. ఇజ్రాయెల్ చట్టసభ సభ్యులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, “వైట్ హౌస్‌లో ఇజ్రాయెల్‌కు మీ అంత గొప్ప స్నేహితుడు ఎవరూ లేరు” అని ట్రంప్‌ను ప్రశంసించారు.

కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 20 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వందలాది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. గాజాకు మానవతా సాయం పెంచడం, ప్రధాన నగరాల నుంచి ఇజ్రాయెల్ బలగాలను పాక్షికంగా ఉపసంహరించడం కూడా ఒప్పందంలో ఉంది.

ట్రంప్ గాజాలో యుద్ధంతో సర్వం కోల్పోయిన ప్రజలకు పునర్నిర్మాణంలో అమెరికా సాయం అందిస్తారని హామీ ఇచ్చారు. పాలస్తీనియన్లు ఉగ్రవాద మార్గాన్ని శాశ్వతంగా వీడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “యుద్ధం ముగిసింది. ప్రజలు కూడా యుద్ధంతో విసిగిపోయారు. అందుకే ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను” అని ట్రంప్ మీడియాతో తెలిపారు.

అయితే, గాజాలో యుద్ధానంతర పాలన, హమాస్ నిరాయుధీకరణ వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఒప్పందం మధ్యప్రాచ్యంలో శాంతి కోసం కొత్త అవకాశాలను సృష్టించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *