ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న దేవాదాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో బాలాజీ ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక నిధి నుంచి ఆర్థిక సహాయం తీసుకోవాలని సీఎం సూచించారు. దేవాలయాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక అవసరమని ఆయన అన్నారు.
ప్రధాన ఆలయాల్లో మాస్టర్ ప్లాన్‌ల ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టాలని, అవి పూర్తిగా ఆగమశాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరో 15 ముఖ్య ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించాలన్నారు. ఆలయ భూములు అక్రమంగా ఆక్రమించబడకుండా చూడాలని, వాటిని వాణిజ్య పరంగా వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేసి, లీజుకు ఇవ్వడంపై స్పష్టమైన విధానం తీసుకురావాలని ఆయన చెప్పారు. ఈ ఆదాయం ఆలయాల అభివృద్ధికి వినియోగించాలన్నారు.
ఆలయాల భూములు హోటళ్లకు లీజుకు ఇస్తే, శాకాహార only హోటల్స్‌కి మాత్రమే అనుమతి ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.50 వేలకుపైగా ఆదాయం ఉన్న దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, మిగిలిన 24,538 ఆలయాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రత, పర్యవేక్షణను మెరుగుపరచడంలో ఇది కీలకమని తెలిపారు.
దేవాదాయ శాఖలో అన్ని స్థాయిల్లో ఖాళీలు భర్తీ చేయాలని, ఆలయాలపై కమిటీలను ఏర్పాటు చేసి ప్రతిరోజూ ధూపదీప నైవేద్యాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల భక్తి, నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఆలయాల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆదేశాల అమలుతో దేవాలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది.