విజయ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ వేదికలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఆగస్టు 29న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేస్తూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీని గుబ్బల నిర్మించారు. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా భావోద్వేగాలు, ప్రేమకథ, కుటుంబ విలువలు వంటి అంశాలను సమతుల్యంగా మేళవించి రూపొందించబడింది. థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. క్రీడా ప్రేరణను అందించే కథతో పాటు హృదయానికి హత్తుకునే సన్నివేశాలు కూడా ఈ సినిమాకు బలాన్నిచ్చాయి.
‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి విమర్శకుల నుండి కూడా విశేష స్పందన లభించింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సినిమా ఇప్పటివరకు 46 ఫిలిం అవార్డులు గెలుచుకోవడం విశేషం. దేశీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శించబడింది.
థియేటర్లలో చూడలేకపోయిన సినీ ప్రేమికులకు ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈ సినిమాను చూడటానికి అవకాశం దొరికింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నందున కుటుంబంతో కలిసి వీకెండ్‌లో చూసే ఉత్తమమైన సినిమా అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. స్పోర్ట్స్, డెడికేషన్, భావోద్వేగాలతో నిండిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని అందించనుంది.
