రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు ఒప్పందాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాతో గతంలో కుదిరిన ప్లుటోనియం నిర్వహణ ఒప్పందాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూ చట్టంపై ఆయన సంతకం చేశారు. 2000 సంవత్సరంలో అమెరికా, రష్యా దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోగా, 2010లో దాన్ని సవరించారు. ఈ ఒప్పందం ప్రకారం రష్యా తమ వద్ద ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లుటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణు విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల సుమారు 17 వేల అణ్వాయుధాల తయారీని అడ్డుకున్నట్లు ఆ సమయంలో అమెరికా అధికారులు తెలిపారు.
అయితే, 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆ సమయంలోనే పుతిన్ ఈ ఒప్పందాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపేయాలని ట్రంప్ చేసిన సూచనను పుతిన్ పట్టించుకోకపోవడం ఆయనకు అసహనంగా మారింది.
ఇప్పుడు ఈ ప్లుటోనియం ఒప్పందాన్ని శాశ్వతంగా రద్దు చేయడం ద్వారా రష్యా–అమెరికా మధ్య సంబంధాలు మరింత చల్లబడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై అణు భద్రత, ఆయుధ నియంత్రణ అంశాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచ అణు ఉద్రిక్తతలకు కొత్త దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
