
దయ, వాత్సల్యానికి మారుపేరుగా నిలిచిన మదర్ థెరిసా జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహోనీయురాలికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్టు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ తెలిపారు.
పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి… వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతామూర్తి మదర్ థెరిసా అని కీర్తించారు. ఎంతోమంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. అంతేకాకుండా… అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అని అభివర్ణించారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ్ భవన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించామని జగన్ వెల్లడించారు. ఆ భవనం కాంప్లెక్స్ ను ఆనాడు తానే ప్రారంభించానని, అందుకు ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా జగన్ పంచుకున్నారు.
